Juvaladinne Fishermen Rescue : నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నానికి చెందిన మత్స్యకారులు కొద్ది రోజుల క్రితం తమ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. వేట సాగిస్తున్న క్రమంలో సముద్రంలో అలల ఉద్ధృతి పెరగడంతో వారి బోటు అదుపుతప్పింది. జువ్వలదిన్నె హార్బర్ సమీపంలో ఆ బోటు చిక్కుకుపోయింది. గాలుల తీవ్రతకు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో తీరానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనే సముద్రంలో లంగరు వేసుకుని ఆగిపోయారు. సముద్రంలో బోటు నిలిచిపోయిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక జువ్వలదిన్నె మత్స్యకారులు వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఉన్న నిజాంపట్నం మత్స్యకారులను కాపాడేందుకు ముందుకొచ్చారు. పాత కడపాలి వద్ద నుంచి సముద్రంలోకి వెళ్లి, అల్లకల్లోలంగా ఉన్న అలలను దాటుకుంటూ ఆ బోటు వద్దకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ఆ బోటును పాత కడపాలి వద్ద తీరానికి సురక్షితంగా తీసుకువచ్చారు. ఆపద సమయంలో తోటి మత్స్యకారులను కాపాడేందుకు అప్రమత్తంగా వ్యవహరించిన జువ్వలదిన్నె, పాత కడపాలి గ్రామస్థులను, మత్స్యకారులను నెల్లూరు జిల్లా కలెక్టర్ అభినందించారు.