Heavy Rain in Guntur and Vijayawada: మురసు తుపాను ప్రభావంతో విజయవాడ, గుంటూరులో వర్షం దంచికొట్టింది. ఏకధాటిగా వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. బందర్ రోడ్డు, ఆటోనగర్, బెంజ్ సర్కిల్, నిర్మలా సెంటర్, మొగల్రాజపురం వంటి ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరుకుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో మురసు తుపాను బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద చెరువు నీరు పొంగి గ్రామంలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గొట్టిపాడు ప్రాంతంలో వాగులు పొంగి పొర్లాయి. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద గుంటూరు ప్రధాన రహదారిపై వరద నీరు పారింది. మలినేని కాలేజీ వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహించి చెరువును తలపించింది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. వింజనంపాడు గ్రామంలో మిరప తోటలోకి వరద నీరు చేరింది. కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో వర్షం వణికించింది. 24 గంటల పాటు ఎడతెరపి లేని భారీ వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా లేక కాకుమాను , పెదనందిపాడు మండలాలు అంధకారంలో ఉన్నాయి. కాకుమాను మండలంలో సుమారు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లమడ వాగుకు భారీగా వరద నీరు చేరింది. వరి పైరులన్నీ నీటిలో నానుతున్నాయి.