Youth Showed Humanity Towards Infected Cow : తీవ్ర గాయాలతో గత పది రోజులుగా నరకయాతన అనుభవిస్తున్న ఓ ఆవుకు ఇందిరానగర్ యువకులు, పశువైద్య సిబ్బంది కలిసి చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ క్రీడా మైదానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ క్రీడా మైదానంలో సంచరిస్తున్న ఓ ఆవు గత పది రోజులుగా తీవ్ర గాయాలతో బాధపడుతోంది. దానికి చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎవరికీ చిక్కకుండా అదుపులోకి రాలేదు. ఆవు పడుతున్న బాధను గమనించిన ఇందిరానగర్ యువకులు వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వైద్యులు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ యువకులు ఎంతో చాకచక్యంగా తాడు సహాయంతో ఆవును బంధించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పశువైద్య సిబ్బంది ఆవు గాయాలకు తగిన చికిత్స అందించారు. ఆపద సమయంలో స్పందించి, శ్రమకోర్చి ఆవు ప్రాణాలను కాపాడిన ఇందిరానగర్ యువకులకు, పశువైద్య సిబ్బందికి ఆవు యజమాని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువకుల చొరవను స్థానికులు అభినందిస్తున్నారు.