Tanuku RTC Bus Stand Flood News : భారీ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు ఆగిపోయినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఆర్టీసీ బస్టాండ్, డిపో ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. బస్టాండ్ లోపలికి ప్రయాణికులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బస్టాండ్ ముందున్న రహదారిపైనే బస్సులు నిలుపుతున్నారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు బస్టాండ్ ముందు రోడ్డు పక్కనే ఉన్న ఫ్లైఓవర్ కింద బెంచీలు ఏర్పాటు చేశారు. బస్టాండ్ లోపల ప్రయాణికులు వేచి ఉండడానికి ఏర్పాటు చేసిన బెంచీలను బయటికి తెచ్చి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. బస్టాండ్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ కింది భాగంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే బస్సు డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు. పట్టణంలో ఎగువ నుంచి వచ్చే వరద నీరు దిగువన ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలోకి చేరుకోవడంతో వరద ముంపు తగ్గడానికి సమయం పడుతోంది. ఆర్టీసీ బస్టాండ్‌కు దిగువన ఉన్న మురుగు కాలువలు కూడా నిండిపోయి ఉండటంతో ముంపు తగ్గడం లేదు. మోటార్లను ఏర్పాటు చేసి వరద నీటిని బయటకు పంపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.