Tension At Hindupuram : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేగిన వివాదం కాస్త తోపులాటకు దారి తీసింది. కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా, ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు శ్రీనివాసరావు, బాలాజీలు కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లినట్లు వైఎస్సార్సీపీ శ్రేణులకు సమాచారం అందింది. మీడియా ప్రతినిధులకే అనుమతి నిరాకరించిన చోట, ఎమ్మెల్యే పీఏలు లోపల ఎలా తిష్టవేస్తారంటూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆగ్రహంతో పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రం వద్దకు దూసుకువచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అక్కడి ప్రధాన గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అలర్ట్ అయిన పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు లోపలికి రాకుండా గేట్ల వద్దే కట్టడి చేశారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, పోలీసులు-వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి చేయు దాటుతోందని గమనించిన అదనపు పోలీసు సూపరింటెండెంట్ అంకిత సురానా వెంటనే రంగ ప్రవేశం చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తును మోహరించి, ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ శ్రేణులను వెనక్కి పంపించి శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. అనంతరం నిబంధనల ప్రకారం కౌంటింగ్ కేంద్రం లోపల ఉన్న ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరావును పోలీసులు వెలుపలికి పంపించడంతో అక్కడ నెలకొన్న ఉద్రిక్తత ఎట్టకేలకు సద్దుమణిగింది. ప్రస్తుతానికి కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.