Increasing Cold in Araku Valley : ఆంధ్రా ఊటీ అరకులోయలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో స్థానిక ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటలు వేసుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుత శీతాకాల సీజన్‌లో అరకులోయ ప్రకృతి అందాలు, పొగమంచు సోయగాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా మాడగడ సన్‌రైజ్ వ్యూ పాయింట్ పర్యాటకులతో సందడిగా మారింది. తెల్లవారుజామునే అక్కడికి చేరుకుంటున్న పర్యాటకులు ప్రకృతి అందాలు, దట్టమైన పొగమంచు మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని వీక్షిస్తూ మంత్రముగ్ధులు అవుతున్నారు. ప్రకృతి సౌందర్యం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. గిరిజన సంప్రదాయ నృత్యమైన ధింసా నృత్యంలో పాల్గొంటూ ఉత్సాహంగా గడుపుతున్నారు. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అరకులోయకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఫొటోలతో, సెల్ఫీలతో చిన్న పెద్ద తేడా లేకుండా కేరింతలు కొడుతూ పర్యటకులు ఉల్లాసంగా గడుపుతున్నారు.