Huge Flood Water In Duduma Reservoir : ఆంధ్రప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్టులో భాగమైన డుడుమ రిజర్వాయర్‌లోకి భారీ వర్షాల కారణంగా వరద నీరు నిరంతరాయంగా వచ్చి చేరుతోంది. గత మూడు రోజులుగా నీటిని విడుదల చేస్తున్నప్పటికీ, ఇన్‌ఫ్లో (నీటి రాక) అధికంగానే ఉంది. దీనివల్ల, 10,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న బలిమెల రిజర్వాయర్‌కు విడుదల చేయడానికి రెండు గేట్లను తెరిచారు. డుడుమ రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 2,590 అడుగులు కాగా ప్రస్తుతం అది 2,587 అడుగుల వద్ద ఉంది. 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి వీలుగా 6-7 నంబర్ గేట్లను ఒక్కొక్కటి ఐదు అడుగుల మేర పైకి ఎత్తారు. మరోవైపు కురుస్తున్న వర్షాల కారణంగా డుడుమకు ఎగువన ఉన్న జలపుట్ రిజర్వాయర్ నీటి మట్టం నాలుగు అడుగులు పెరిగి 2,743 అడుగులకు చేరింది. దీని పూర్తి సామర్థ్యం 2,750 అడుగులు.
Comments