Road Breached by Flood Water Traffic Problems : వరద నీటి తాకిడి ఎక్కువ కావడంతో పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం ముద్దాపురం రహదారిపై గండి పడింది. దీంతో వివిధ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్ర కాలువ ప్రభావంతో వయ్యేరు కాలువ ఉప్పొంగి ప్రవహించడంతో ఈ రహదారి పక్కనున్న పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. పంట పొలాల్లో 4 అడుగులకు పైగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించి రోడ్డును తాకింది.10 కి.మీ పైగా చుట్టూ తిరిగి రావాల్సిందే : సంబంధిత అధికారులు రోడ్డుపై అటుగా ప్రయాణానికి అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.రహదారి మధ్య సుమారు 4 అడుగులు లోతుకు కొట్టుకుపోవడంతో దువ్వ నుంచి ముద్దాపురం, కోనాల, ఆరుళ్ల తదితర గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గండికి ఆవల వైపు గ్రామాల ప్రజలు దువ్వ రావాలంటే సుమారు 10 కిలోమీటర్ల పైగా చుట్టూ తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడింది.