Heavy Traffic on Vijayawada Highway : దసరా పండుగ సెలవుల కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పురపాలిక పరిధిలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. ధర్మోజిగూడెంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ సమస్య ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే మీదుగా ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్లు, వాహనాలు జాతీయ రహదారి గుండా వెళ్లడం వల్ల ప్రయాణ వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది.దుర్గా శరన్నవరాత్రులు, దసరా పండుగ వేళ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య రద్దీ పెరగడానికి కారణమయ్యింది. దీంతో జాతీయ రహదారి-65పై వాహనాలు బారులు తీరాయి. లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు కిలోమీటర్‌కు పైగా దూరం వాహనాలు నిలిచిపోయాయి. అవి నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి కదులుతున్నాయి. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.