Huge Devotees Crowd at Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పెరటాసి మాసం మూడో వారం కావడంతో భక్తులతో సప్తగిరులు కిక్కిరిసిపోయాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండాయి. నిన్న(మంగళవారం) అర్ధరాత్రి శ్రీవారి సర్వదర్శనానికి భారీ స్థాయిలో భక్తులు ఔటర్ రింగు మీదుగా వెళ్తున్న వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం సర్వదర్శన భక్తులను పాచికాలువ ఆలయం నుంచి బాట గంగమ్మ ఆలయం శాశ్వత క్యూలైన్ లోకి అనుమతిస్తున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అల్పాహారం,నీరు, పాలు అందజేస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా ఇవాళ, అక్టోబర్ 5న సిఫార్సు లేఖలపై ఇచ్చే దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇది వరకే టీటీడీ ప్రకటించింది. అయితే ఈ విషయం తెలియని కొందరు భక్తులు సిఫార్సు లేఖలను తీసుకొని అదనపు ఈవో కార్యాలయానికి వచ్చారు. దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. తప్పని పరిస్థితిలో టీటీడీ అధికారులు వారిని 300 రూపాయల ప్రత్యేక దర్శనాలకు అనుమతించారు.