Ideal Joint Family In Adilabad : ఆధునిక ఉరుకులు, పరుగుల కాలంలో అన్నదమ్ములు వేర్వేరు కాపురాలు పెట్టడం, చిన్న మనస్పర్థలకే ఉమ్మడి కుటుంబాలు ఛిన్నాభిన్నం అవడం సాధారణమైపోయింది. కానీ ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం మాంజీరాంతండాలో మాత్రం నేటికీ 34 మంది సభ్యులు ఒకే గూటి కింద కలిసి మెలిసి జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేస్రోత్ మోనాబాయి, చందూలాల్ (దివంగత) దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కుమార్తె వివాహమై అత్తారింటికి వెళ్లిపోగా, మిగతా ఐదుగురు కుమారులు, కోడళ్లు, వారి పిల్లలంతా కలిసి ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. ఒకేచోట ఆరు ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ అందరి వంట గది, భోజన సమయం మాత్రం ఒక్కటే. జొన్న, గోధుమ పిండి కలిపి రోజూ ఉదయం 100, సాయంత్రం 100 రొట్టెలు, 4 కిలోల చొప్పున బియ్యంతో వంట చేస్తారు. సొంతం, కౌలు కలిపి మొత్తం 34 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. 120 వరకు ఆవులు, మేకలు, గొర్రెలను పెంచుతున్నారు. కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారివి అన్నట్లుగా పనులను విభజించుకున్నారు. బాధ్యతలు, పరస్పర గౌరవమే తమ కుటుంబ బలమని కుటుంబసభ్యులు ఆనందంగా చెబుతున్నారు.