A Big Crocodile Appears Near Paderu : గత కొన్ని రోజులుగా అల్లూరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అడవి జంతువులు తరచుగా కనిపిస్తున్నాయి. చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ పరిధిలోని బందబయలు వాగు వద్ద ఓ భారీ మొసలి ప్రత్యక్షమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పంట పొలాలకు వెళ్తున్న రైతులకు ఈ మొసలి కంటపడటంతో వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కోరుకొండ, బలపం, అన్నవరం మీదుగా ప్రవహించే బందబయలు వాగు లోతుగడ్డ గ్రామానికి సమీపంలో ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలోని వాగు ఒడ్డున ఆ భారీ మొసలి సేదతీరుతూ గ్రామ రైతులకు కనిపించింది. అక్కడే ఉన్న స్థానిక యువత ఆ మొసలి దృశ్యాలను తమ సెల్ఫోన్లలో వీడియో తీశారు. గ్రామ సమీపంలోనే మొసలి సంచరిస్తుండటంతో రైతులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి మొసలిని సురక్షితంగా బంధించి, గ్రామస్థులకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.