Leopard Sighting Paderu : అల్లూరి జిల్లా పాడేరు పరిసరాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోని లాడాపుట్టులో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మత్స్యరాజు తన వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఓ చిరుతపులి వేగంగా అటుగా దూసుకువెళ్లడం ఆయన కంటపడింది. ఆ జంతువు దూరంగా ఉండటంతో ఆయన వెంటనే అప్రమత్తమయ్యాడు. ధైర్యంగా తన మొబైల్ ఫోన్ తీసి ఆ చిరుత కదలికలను రికార్డు చేశాడు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.భయాందోళనలో ఉన్న గ్రామస్థులకు వారు ధైర్యం చెప్పారు. చిరుత ఏ మార్గంలో వెళ్లిందనే వివరాలను ఆరా తీశారు. పొలాల్లో ఉన్న ఆ క్రూర జంతువు పాదముద్రలను అటవీ సిబ్బంది నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ఈటీవీ భారత్ ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా, ఉపాధ్యాయుడు మత్స్యరాజు ఆ పూర్తి వివరాలను పంచుకున్నారు.