Poleramma Jatara Has Begun In Venkatagiri Tirupati District : తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రముఖ సాంప్రదాయ జానపద ఉత్సవమైన 'వెంకటగిరి పోలేరమ్మ జాతర' సందడి మొదలైంది. బుధవారం ప్రారంభమయ్యే ఈ రెండు రోజుల జాతరకు ముందుగా ఆదివారం నాడు 'ఘటోత్సవం' (పవిత్రమైన కుంభం ఊరేగింపు)కు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి స్థానిక విశ్వోదయ ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక నృత్య ప్రదర్శనలు, భజనలు, అలాగే భక్తి గీతాలు, ప్రజాదరణ పొందిన సినిమా పాటల ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. కళాకారులు అమ్మవారి సాంప్రదాయ వేషధారణలో ప్రత్యేక నృత్యాలను ప్రదర్శించారు. ప్రముఖ గాయని మంగ్లీ, ఆమె బృందం అలాగే ఈటీవీకి చెందిన 'జబర్దస్త్', 'ఢీ' షోల కళాకారుల ప్రదర్శనలు యువతను ఉత్సాహపరిచాయి. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కళాకారులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమం అంతా చాలా సందడిగా సాగింది.