Mission Bhagiratha Pipeline Leakage Water Fountain in Medak : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భూగర్భ జలవనరులు పాతాళానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ పైపులైన్ ఎయిల్వాల్వ్ పగిలింది. దీంతో పెద్ద ఎత్తున నీరు పైకి ఎగిసి పడింది. భారీగా తాగు నీరు వృథా అయ్యింది. ఫౌంటేన్ మాదిరిగా నీరు ఎగిసిపడుతుండటంతో అటుగా వెళ్లే వాహనదారులు ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. వివరాల్లోకి ఇలా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో నర్సాపూర్ రోడ్డు వద్ద శ్రీ రేణుకాఎల్లమ్మ ఆలయ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజ్ అవ్వడంతో భారీగా నీరు పైకి ఎగిసి పడింది. దాన్ని చూస్తుంటే నిజంగానే ఫౌంటేన్ లాగా కనిపించడంతో స్థానికులు, వాహనదారులు కాసేపు వీడియోలు తీసుకుంటూ సంబరపడ్డారు. లీకేజ్ కారణంగా నీరు పైకి ఎగిసిపడటంతో రోడ్డుపై నీరంతా ప్రవహించింది. పైప్లైన్ పగిలిన విషయాన్ని గుర్తించిన అధికారులు, నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.