Fire at Private Travels Bus in Meerpet : మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఓ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే, నాగోల్‌కు చెందిన శ్రీ మహాలక్ష్మీ రియల్ ఎస్టేట్‌కు చెందిన సుమారు 150 మంది గణేశ్ నిమజ్జనంతో పాటు మల్లన్న దర్శనం కోసం 3 బస్సుల్లో శ్రీశైలానికి బయలుదేరారు. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో గాయత్రీ నగర్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు బస్సుల్లో డీజిల్ పోస్తుండగా ప్రధాన రహదారిపై నిలిపి ఉంచిన మూడో బస్సులో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రాణ నష్టం, గాయాలు సంభవించలేదు. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.