Heavy Rain In Jangareddigudem Triggers Tree Fall : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో నేడు(శుక్రవారం) ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పట్టణంలో డ్రైనేజీలు పొంగి రహదారులపై ప్రవహించాయి. స్థానిక పాత బస్టాండ్ వద్ద కురిసిన వర్షానికి సుమారు 100 ఏళ్ల వయసున్న భారీ చెట్టు నేలకొరిగింది. అదే సమయంలో చెట్టు కింద పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనంపై ఆ భారీ వృక్షం పడటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. భారీ వృక్షం కూలిన ఘటన తరువాత చెట్టును బైక్పై నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టారు. వర్షం కారణంగా పట్టణంలో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తమైంది. స్థానికులు పాత చెట్లను తొలగించాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.