Lavanya Tripati In Tirumala : ప్రముఖ సినీ నటుడు వరుణ్ తేజ్ సతీమణి, నటి కొణిదెల లావణ్య త్రిపాఠి శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున తిరుమల క్షేత్రానికి చేరుకున్న లావణ్య త్రిపాఠికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆమె, స్వామి వారి సుప్రభాత సేవ, అర్చన సేవలలో పాల్గొన్నారు. తర్వాత గర్భాలయంలోని ఆనంద నిలయ మహాద్వారం గుండా శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు లావణ్య త్రిపాఠికి వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి పట్టు వస్త్రాన్ని కప్పి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ దర్శనం ముగించుకుని వెలుపలికి వచ్చిన లావణ్య త్రిపాఠిని చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి కనబరిచారు. పలువురు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడగా, ఆమె ఎంతో ఓపికగా అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు.